రాకీ పౌర్ణమి. శుభములు
మీకును భగవంతుడిచ్చు మేలుగ నెపుడున్.
నాకున్న యన్న మీరే.
మీ కానుక దీవెన లవి. మేలగు నాకున్.
భారతీయ సంప్రదాయములో రాఖి పౌర్ణమి విశిష్టమైన స్థానం కలిగివుంది. ఈ పండుగను రక్షాబంధనం (రాఖీ) పండుగ గానూ, జంద్యాల పూర్ణిమ, వైఖానస మహర్షి జయంతి గాను, హయగ్రీవ జయంతి గాను , వరుణ పూజల రూపంలో ఈ పూర్ణిమను ఉత్సవంగా అందరూ జరుపుకుంటుంటారు. మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు. పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. ఈ రక్షాబంధనం సందర్భంలో చదివే శ్లోకం.
'యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః,
తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల'
దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది. బలిచక్రవర్తి రక్షకోరిన సోదరిని రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలెదురైనా తడబడక ధైర్యంతో ఎదురొడ్డి నిలిచినవాడు. అటువంటి మహావీరునితో తన అన్నని పోలుస్తూ తనకి రక్షణ నివ్వమని కోరుతుంది. ఈ రాఖీ కట్టిన సోదరికి తగిన బహుమానం ఇస్తూ ఆశీర్వధిస్తాడు అన్న. రాఖీ పౌర్ణమి, శ్రావణ పున్నమిరోజును యిలా ఎన్నోరకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దేవతారాధనలు, ప్రకృతి దేవతారాధనలు, ఆత్మీయతానురాగబంధాలు... సకల పూజారాధనలు అందుకునే రోజు ఈ శ్రావణ పౌర్ణమి. చరిత్రలో మొగలాయి చక్రవర్తుల ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత కొత్త విశిష్టత సమకూరింది. రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తూరు మహారాణి కర్ణావతి గుజరాత్ నవాబైన బహదూర్‌షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమయూన్‌కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్‌షాను తరిమి వేశాడని ఆనాటి నుంచి సోదరీసోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని అంటారు. శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది దీనినే జంద్యాల పౌర్ణమి గా అంటారు.
హయగ్రీవ జయంతి గా కూడా జరుపుకుంటారు.
జ్ఞానానందమయం దేవం నిర్మలస్పటికాకృతిం |
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||
వ్యాఖ్యా ముద్రాం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే
బిభ్రద్భిన్నస్పటికరుచిరే పుండరీకే నిషణ్ణః |
అమ్లానశ్రీరమృతవిశదైరంశుభిః ప్లావయన్ మాం
ఆవిర్భూయాదనఘ మహిమా మానసే వాగధీశః ||
అది లక్ష్మీమయమైన మాసంలో వచ్చినది కనుక సంపదలు ఇచ్చే శక్తి ఉంది. దానితో పాటు సర్వ విద్యా స్వరూపుడైన భగవంతుని విద్యాప్రదమైన అవతారం హయగ్రీవ అనే అవతారం జరిగింది ఈ శ్రావణ పూర్ణిమ రోజే. అందుకే ఈ రోజుకి అంత ప్రాధాన్యం. మనిషికి ప్రధానమైనది జ్ఞానం, జ్ఞానానికి ఆధారం శాస్త్రాలు, శాస్త్రాలకు మూలం వేదం. ఆవేదాన్ని లోకానికి అందించిన అవతారం హయగ్రీవ అవతారం. విద్య చదువుకున్న వారికందరికి కంకణం కడుతారు, వారు రక్షకులు అవుతారు అని. జ్ఞానికి రక్షగా ఉంటారని. ఆ జ్ఞానం చెప్పే భగవంతునికి చెందిన వాటంతటికి రక్ష. ఆ కంకణ ధారణ అనేదే రక్షబంధనం అయ్యింది. వేదం చదువుకునే వారందరూ శ్రావణ పూర్ణిమ నాడు ఆరంభంచేసి నాలుగు నెలలు వేదాధ్యయనం చేస్తారు. ఆతరువాత వేద అంగములైన శిక్షా, వ్యాకరణం, నిరుక్తం, కల్పకం, చందస్సు మరియూ జ్యోతిష్యం అనే షడంగములను అధ్యయనం చేస్తారు. విద్యారక్షకుడైన భగవంతుడిని ఉపాసన చేసుకొని మొదలు పెడుతారు. వేదాన్ని కొత్తగా నేర్చే వారే కాక, వేదాన్ని నేర్చినవారు తిరిగి ఇదే రోజునుండి మరచిపోకుండా నవీకరణం చేసుకుంటూ అధ్యయణం మొదలు పెడుతారు. హయగ్రీవుడిగా అవతరించి లోకాన్ని ఉద్దరించిన రోజు.
బ్లాగ్ మిత్రులుకు రక్షాబంధన శుభాకాంక్షలు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.