హిందువుల పండుగలలో వైకుంఠ పదంతో రెండు ఉన్నాయి. ఒకటి వైకుంఠ చతుర్దశి, రెండు వైకుంఠ ఏకాదశి. అయితే ఈ రెండు పర్వాలు ఆంధ్ర ప్రాంతంలో వేరుపేర్లతో పిలుస్తారు.
వైకుంఠ ఏకాదశిని ఎక్కువగా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. కాలపరిగణనంలో తెలుగువారిది చాంద్రమానం. వైకుంఠ ఏకాదశి సౌర మాన ప్రకారం జరిపే పండుగ. కర్కాటక సంక్ర మణం, మకరసంక్రమ ణం మున్నగు పర్వాలవలె ఇది కూడ సౌరమానాన్ననుసరించి తెలుగు వారు జరిపే పండుగలలో ఒకటి. ధనుస్సు నెల పట్టిన తరువాత శుద్ధంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఇది మార్గశిరంలో కాని, పుష్యంలో గాని వస్తుంది.
ఇది వైష్ణవులకు, రామానుజ, మాధ్వమతస్థులకు చాలా ముఖ్య మైనది. అయినప్పటికీ దీనిని అందరూ ఈ ముక్కోటి ఏకాదశిని భక్తి శ్రద్ధలతో చేస్తారు. పంచాగ కర్తలు ఈనాటి వివరణలో వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, శ్రీరంగద్వారస్థ భగవదాలోకన మహోత్సవం అని వ్రాస్తారు.
ఒకటి స్వర్గ ద్వారం, రెండు ముక్కోటి, మూడు వైకుంఠం. ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరుస్తారనీ, దక్షిణాయనంలో నిర్యాణమైనవారు స్వర్గంలో ప్రవేశిస్తారని నానుడి. ఈ కారణంచేత ఈ పండుగకు దక్షిణా దిని కొన్ని ప్రాంతాలలో స్వర్గ ద్వారం అనే నామం కూడా ఉంది. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.
వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరవాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.