హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు 31 ఆగస్టు 1864 జన్మించారు.
ఈయన పూర్తి పేరు అజ్జాడ ఆదిభట్ల
నారాయణదాసు ప్రముఖ హరికథా కళాకారుడు, సంస్కృతాంధ్రాలలో
అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా
హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన.
"శ్రీమత్" మరియు "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ
నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు
పాటిస్తున్న సంప్రదాయం. ఈయన చిన్నతనం నుండి కూడా ఏకసంథాగ్రాహి. చిన్న
తనంలో కూడా భాగవతం పద్యాలు చాలా బాగా పాడేవారు. ఈయన అష్టావధానిగా రాణించారు. మానవాళికి భక్తీ, జ్ఞాన, మోక్షములను ప్రబోధించే ఉద్దేశంతో నారాయణ దాసు గారు ‘హరికథ’ సృష్టి చేశారు. వారు హరికథను ‘సర్వ కళల సమాహారం’ అని అభివర్ణించారు.
నారాయణ దాసు గారు సృష్టించిన హరికథలో కథాప్రవచనము, ఆశుకవిత్వము, శాస్త్రీయసంగీతము, నృత్యం, అభినయం ప్రధానాంగాలు. సమయ, సందర్భాలను బట్టి వారు
ప్రదర్శించిన హరి కథలలో సంగీత, సాహిత్య చర్చలు ఉండేవి.
ఒక విధంగా చెప్పాలంటే, నారాయణ దాసు గారు, అంతకుముందు జానపద కళగా ఉన్న హరికథను సారస్వత సభల
స్థాయికి, సంగీత కచేరిల ఉన్నత స్థాయికి
చేర్చారు. ఈ కళా రూపాన్ని
సృష్టించిన నారాయణ దాసు గారు తెలుగులోనూ, సంస్కృతంలోను, అచ్చతెలుగులోను హరికథలను రచించారు. ఇందులో యధార్థ రామాయణంపేర
శ్రీరామ కథ, తెలుగు హరికధలు, హరికధామృతం పేర
శ్రీకృష్ణుని కథ సంస్కృతం హరికధలు మరియు గౌరాప్పపెండ్లి హరికథ
ఉన్నాయి. వారు రచించిన (ఉత్తర రామాయణ కథ)జానకీశపధం అనే హరికథ ౩౬ అపూర్వ కర్నాటక సంగీత రాగాలతోగూడి, సంగీతపరంగా ఎంతో ప్రశస్తిపొందింది. తెలుగు, సంస్కృతం, హిందీ, బెంగాలీ, పారశీకం, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ భాషలన్నింటిలో అనర్గళంగా హరికథను
చెప్పగలిగిన హరికథా పితామహుడు. కవిత్వం, సంగీతం, నాట్యం ఈ మూడు ప్రక్రియలకు భక్తిని కలిపి హరికథకు ప్రాణం వంటిది
ఆరోజుల్లో మైకులు లేకుండానే హరికధ చెప్పేవారు. అయన సౌండ్ కంచు మోగినట్టు
గట్టిగా పాడేవారు. దాసుగారు సుమారు 21 హరికధలు స్వర పరచారు
అని చెప్పుకోవచ్చు. ఆనాటి సంగీత సాహిత్య ప్రపంచం
నారాయణ దాసుగారికి ‘సంగీత
సాహిత్య సార్వభౌమ’, ‘లయ బ్రహ్మ’, ‘పంచముఖి పరమేశ్వర’ మరియు ‘హరికథ పితామహ’ లాంటి బిరుదులతో సన్మానించింది. వీటిలో ‘లయ బ్రహ్మ’, ‘పంచముఖి
పరమేశ్వర’ బిరుదులు వారి అనన్య సామాన్యమైన తాళజ్ఞాన ప్రతిభకి గుర్తింపు. దాసు గారు ఒక
కీర్తన గానం చేసేటప్పుడు రెండు చేతులతో రెండు తాళాలు, రెండు భుజాలతో రెండు తాళాలు, తలతో ఐయదవ తాళం వేయగలిగే వారట. ఈ ప్రజ్ఞనే ‘పంచముఖి’ అంటారు. ఈ ప్రజ్ఞను కూడా
అధిగమించి నోటితో గానంచేసే కీర్తనను ఆరవ తాళంలో గానం చేయగలగడం ‘షణ్ముఖి’. ఈవిధంగా అయిదు, ఆరు తాళాలతో గానం చేసే
సంగీత విద్వాంసులు వేరొకరు లేరు; ‘నభూతో నభవిష్యతి’ అనడం అతిశయోక్తి కానే కాదు. నారాయణ దాసు గారి తెలుగు భాషాభిమానాన్ని
గౌరవించి భారతి తీర్థ, ‘ఆట
పాటల మేటి’ అనే (తెలుగు) బిరుదుని ప్రదానం చేసి గౌరవించింది. ఆదిభట్ల నారాయణదాసుగారు 2 జనవరి 1945 న మరణించారు.
శ్రీ కృష్ణ మాయ హరికధ
ఆ మహనీయుడు తెలుగు జాతికి అధ్బుతమైన, అనన్య సామాన్యమైన, అనితర సాధ్యమైన, అజరామరమైన సాహిత్య సంపదను కానుకగా ఇచ్చారు. ఈరోజు ఆదిభట్ల నారాయణదాసు గారి జన్మదినం సందర్బంగా హరికధ విని ఆయనను గుర్తుచేసుకుందాం. హరికధా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసుగారి జయంతి సందర్బంగా వారిని స్మరించుకోవడం ప్రతి తెలుగు వాడి కనీస కర్తవ్యం. హరికధ కళాఅభిమానులందరికి హరికధా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసుగారి జయంతి శుభాకాంక్షలు.