శ్రీ పింగళి వెంకయ్య గారు మన జాతి మొత్తం గుర్తుచేసుకొని గర్వించగల మహామనిషి అందులోను ఈయన మన ఆంద్రుడు. ఈయన జన్మ్దదినము ఆగష్టు 2వ తారీకున.వెంకయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా మచిలీపట్నము సమీపమున ఉన్న ప్రస్తుత మొవ్వ మండలములోని భట్లపెనుమర్రు గ్రామములో హనుమంతరాయుడు మరియు వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు. ఈయన గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారతదేశ జాతీయ పతాక రూపకర్త .
1916 సంవత్సరం లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు. లాలా హన్స్ రాజ్ మన జాతీయ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాడు. అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ, వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం- ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరాడు. మహాత్ముని సూచనపై కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్యన రాట్నం చిహ్నం గల జాతీయ జెండాను సమకూర్చాడు వెంకయ్య. అనంతరం కోత్త ఆలోచన మీద, సత్య- అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగును కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి అందించారు. కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించాడు. మధ్యనున్న రాట్నం చిహ్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్పురింప చేస్తుందన్నారు. అంటే కార్మిక కర్షకులపై ఆధారపడిన మన దేశం, సత్యాహింసలపై ఆధారపడటంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం.1947, జూలై 22 వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ , మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నం మాత్రం వదిలి, దాని బదులు అశోకుని ధర్మచక్రం చిహ్నంగా యిమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే శ్రీ పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం. శ్రీ పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలోని వివిధ ఘట్టాలలో పాల్గొన్నాడు. వందేమాతరం, హోంరూల్ ఉద్యమం, ఆంధ్రోద్యంలాంటి ప్రసిద్ధ ఉద్యమాలలో ప్రాధాన పాత్రధారిగా ఉన్నాడు. గాంధీజీ ప్రోద్భలంతో త్రివర్ణపతాకం పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోనే. మన జాతికొక పతాకం కావాలని, అదీ ఒక ఆంధ్రుని ద్వారా రూపొందిచడటం , ఆంధ్రులందరికీ గర్వకారణమైన విషయం. .జాతీయ పతాకం రెప రెప ఎగిరినంతకాలం వరకు స్మరించుకోదగిన ధన్యజీవి శ్రీ పింగళి వెంకయ్య . ఆయన జన్మదినము నాడు ఆయన గురించి తెలుసుకొని వివరిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.
జైహింద్
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.