మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి, మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించిన వారు , తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే, తెలుగులో తొలి నవల రాసింది ఆయనే, తెలుగులో తొలి ప్రహసనం రాసింది అతనే , ఆయనకున్న ఇతర విశిష్టతలు పద్య కావ్యాలు, నాటకాలు, నవలలు, ప్రహసనాలు, కధలు, వ్యాసాలు,చరిత్రలు ఇంకా ఎన్నో రచనలు రాసారు . చాలా పత్రికలు కూడా నడిపారు. అతనెవరో తెలుసా కందుకూరి వీరేశలింగం పంతులు గారు . కందుకూరివారు ఎంతోమందికి ఆదర్సవంతముగా నిలిచారు అనటంలో సందేహం లేదంటే నమ్మండి . గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు నిరుపమానమైన కృషి చేసిన మహానుభావుడు ఆయన. సాహితీ వ్యాసంగంలోనూ అంతటి కృషి చేసిన కందుకూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు.
వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లాలోని కందుకూరు గ్రామం నుండి రాజమండ్రికి వలస వెళ్ళడం వలన వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది. వీరేశలింగంకు నాలుగేళ్ళ వయసులో తండ్రి చనిపోయారు. పెదతండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగారు. ఐదో యేట బడిలో చేరి, బాలరామాయణం, ఆంధ్ర నామ సంగ్రహం, అమరం, రుక్మిణీ కళ్యాణం, సుమతీ శతకం, కృష్ణ శతకం మొదలైనవి నేర్చుకున్నారు. పన్నెండో యేట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువులో చేరారు. చిన్నప్పటినుండీ, అన్ని తరగతులలోనూ, ప్రథమ శ్రేణిలోనే ఉండేవారు. తన పదమూడో యేట బాపమ్మ అనే ఎనిమిదేళ్ళ అమ్మాయితో బాల్యవివాహమయింది. పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేసారు.
ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి.
ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించారు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసారు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పని చేసారు. తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పక్కుండా పాటించిన వ్యక్తి ఆయన.యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది. ఆంధ్ర సమాజాన్ని సంస్కరణాల బాట పట్టించిన సంస్కర్త, వీరేశలింగం 1919 మే 27న మరణించారు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.