శ్రీ మహాలక్ష్మి దేవి: దసరా నవరాత్రులలో నాల్గవరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి గా దర్శనము ఇస్తారు.లక్ష్మి దేవి హిందు వుల సాంప్రదాయం ప్రకారం మనకు సిరి సంపదలు, సౌభాగ్యం, సుఖ సంతోషాలును కలుగ జేసే మాత లక్ష్మి మాత. ఈమె క్షీరసముద్ర తనయ. త్రిముర్తులలో శ్రీమహావిష్ణువు అర్ద్దాంగి. అధికంగా లక్ష్మీదేవి చతుర్భుజాలతోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి, సకలాభరణ భుషితయైనట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ. సర్వ శుభ లక్షణ నిలయ, సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది. ఆమె బంగారు మేనికాంతి కలది (హిరణ్యవర్ణాం), బంగారు ఆభరణములు దాల్చినది (సువర్ణ రజతస్రజాం), వెన్నెలలా మెరుస్తున్నది (చంద్రాం), గజరాజుల ఘీంకారములతో సంబోధింపబడుచున్నది (హస్తినాద ప్రబోధినీం), చిరునగవులు చిందించునది (కాంసోస్మితాం), కీర్తిచే శోభిల్లునది (యశసా జ్వలన్తీం), సకల దారిద్ర్యములను నశింపజేయునది (అలక్ష్మీర్మే నశ్యతాం), పద్మమాలను ధరించినది (పద్మమాలినీం), పద్మమునుండి జనించినది (పద్మోద్భవాం), అందరికి ప్రీతిపూర్వకమైన (ప్రజానాం భవసి )సుక్తములో వివరించారు. శ్రీలక్ష్మి గురించి. దేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు - ఆదిలక్ష్మి, ధైర్య లక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యాలక్ష్మి, ధన లక్ష్మి - ఆయా రూపాలలో ఆ దేవి ఆయా ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
మహాలక్ష్మిదేవికి క్షీరాన్నము నైవద్యముగా సమర్పిస్తారు. ఈమె కోరిన కోరికలు తీర్చేమాత.
శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్
నమస్తేతు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంకచక్ర గదా హస్తే మహలక్ష్మి నమోస్తుతే
నమస్తే గరుడారూడే డోలా సురభయంకరి
సర్వపాపహరే దేవి మహలక్ష్మి నమోస్తుతే
సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్టభయంకరి
సర్వదుఖహరే దేవి మహలక్ష్మి నమోస్తుతే
సిద్ధిబుద్ధిప్రదేదేవి భక్తిముక్తి ప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవి మహలక్ష్మి నమోస్తుతే
ఆద్యంతరహితే దేవి అదిలక్ష్మి మహేశ్వరీ
యోగజ్ఞే యోగసంభూతే మహలక్ష్మి నమోస్తుతే
స్తూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే
మహాపాపహరే దేవి మహలక్ష్మి నమోస్తుతే
పాశాంకుశధరే దేవి పరబ్రహ్మస్వరూపిణి
పరమేశి జగన్మాత మహలక్ష్మి నమోస్తుతే
శ్వేతాంభరధరే దేవి నానాలంకారభూషితే
జగస్తితే జగన్మాతః మహలక్ష్మి నమోస్తుతే
మహలక్ష్మష్టకం స్తోత్రం యఃపఠే భక్తిమాన్నరః
సర్వసిద్ది మవాప్నోప్తి రాజ్యం ప్రాప్నోప్తి సర్వదా
ఏకకాలే పఠేనిత్యం మహాపాప వినాశనం
ద్వికాలం యఃపఠేనిత్యం ధనధాన్యం సమన్వితం
త్రికాలం యఃపఠేనిత్యం మహాశత్రు వినాశనం
మహాలక్ష్మిర్భవేనిత్యం ప్రపన్నా మమ సర్వదా
ఇతి ఇంద్రకృత శ్రీమహాలక్ష్మ్యష్టకం
సంపూర్ణం
కూష్మాంఢ : నాలుగవ రోజు నవదుర్గలలో కూష్మాండమాతగా అలంకరిస్తారు. ఈమె మంచిగా దరహాసము చేయుచు (అవలీలగా) బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి 'కూష్మాండ' అను పేరుతో విఖ్యాత యయ్యెను. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల ప్రభావముననే దశదిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండము నందలి సకల వస్తువులలో, ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే. 'అష్టభుజాదేవి' అని కూడ అనబడు ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లిచుండును. ఏడు చేతులలో వరుసగా కమండలువు, ధనుస్సు, బాణము, కమలము, అమృతకలశము, చక్రము, గద - అనునవి తేజరిల్లుచుండును. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాల యుండును. ఈమెయు సింహవాహనయే. భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తయై ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు, ఆరోగ్యభాగ్యములు వృద్ధిచెందును. కొద్దిపాటి భక్తిసేవలకును ఈదేవి ప్రసన్నురాలగును.
కూష్మాంఢ దేవి స్తుతి:
సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యాశుభదాస్తు సదాదేవి స్కాందమాతా యశస్వినీ
ఈ రోజు అమ్మవారికి చేసే అన్నం ప్రసాదాన్ని నూనెతో కాక నేతితో పోపు పెట్టి నేతి అన్నం నైవేద్యం పెడతారు .