దసరా నవరాత్రులలో అమ్మవారు మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా దర్శనము ఇస్తారు. నవదుర్గాలలో చంద్రఘంటాదేవి గా దర్శనము ఇస్తారు. అన్నపూర్ణ దేవి :
అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారికలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయశుభాలను అందిస్తుంది.
అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్పూర్తి, వాక్శుద్ది, వాక్సిద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి. బుద్ధి ఙ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచైన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని అర్షవాక్యం. ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరిమ్చి, తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి. " హీం శ్రీం, క్లీం ఓం నమోభగత్యన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణ చెయ్యాలి.
చంద్రఘంటాదేవి
ఈ తల్లి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు 'చంద్రఘంట' యను పేరు స్థిరపడెను. ఈమె శరీరము బంగారు కాంతి మయము. ఈమె తన పది చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. ఈమె సింహ వాహన. ఈమె సర్వదా సన్నాహయై యుద్ధముద్రలోనుండును. ఈమె గంటనుండి వెలువడు భయంకరధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడు వడగడలాడుచుందురు. కాని భక్తులకును, ఉపాసకులకును ఈమె మిక్కిలి సౌమ్యముగను, ప్రశాంతముగను కన్పట్టుచుండును.
ఈ దేవి ఆరాధన సద్యఃఫలదాయకము. భక్తుల కష్టములను ఈమె అతి శీఘ్రముగా నివారించుచుండును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు. ఏవిధమైన భయములును వారిని బాధింపజాలవు.
Thank you!
రిప్లయితొలగించండి