ఆషాడ మాసం వెళ్ళిపోయి శ్రావణమాసం వచ్చేసింది. అందరి ఇళ్ళల్లోను హడావిడి. ఎందుకు ఈ హడావిడి. శ్రావణమాసం అంటే అందరికి ఇష్టం కాబట్టి. శ్రవణమాసం అంటే ఇళ్ళలో పూజలు, వ్రతాలు నోములు చేసుకుంటారు కదా. అసలు ఈ శ్రావణ మాసం అని ఎందుకు పేరు వచ్చిందో మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా ? నాకు అయితే వచ్చింది అయితే అది తెలుసుకునే ప్రయత్నం చేశా అప్పుడు అమ్మమ్మ తన పని చేసుకుంటూ నాకు చెప్పింది. అది ఏమిటి అంటే మనయొక్క మొరలని ఆలకించేందుకు ఆ తల్లిని (లక్ష్మీదేవి) సిద్దపరిచే మాసం కనుకనే శ్రావణం అని పేరు వచ్చింది . మన మొరలని ఆలకించే సమయం, శ్రవణ సంబంధమైన మాసం శ్రావణము. ఈ మాసంలో అమ్మ మనకు ఏకాంతంగా లభిస్తుంది. ఆషాడ మాస ఏకాదశి వరకు స్వామితో నిరంతరం ఉండే తల్లి పాలకడలిలో స్వామిని యోగ నిద్రలో పవళింపజేసి జగత్ రక్షణ ఎట్లా చేయాలో ఆలోచించుకోవడానికి కావల్సిన సమయాన్ని ఆయనకు ఇవ్వడానికి స్వామికి విశ్రాంతినిచ్చి అమ్మ బయలుదేరుతుంది. తరువాత వచ్చే మాసమైన శ్రావణ మాసంలో అమ్మ అందరి మొరలు వినడానికి అందుబాటులోకి వస్తుంది. అందుకే అమ్మను ఆరాధన చేస్తుంటారు. శ్రావణ మాసం అంతా అమ్మను ఆరాధన చేయడానికి వీలైన సమయం. ప్రక్కన స్వామి లేనప్పుడు మన భాదలను అమ్మతో ఒంటరిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఆ అమ్మ దయకోసం మనం ఎంతో ప్రయత్నం చేయాలి. ఆ అమ్మకు అనేక రకాల పేర్లు ఉన్నట్లు మనం గ్రంథాల్లో చూస్తున్నాం. ఆమె కి వెయ్యి పేర్లు వున్నాయి. ఆమెకి లక్ష్మీ అని పేరు. శ్రీ అని పేరు. ఇందిరా అని పేరు. లోక మాతా, రమా, మంగళ దేవతా అని ఇలా ఎన్నేన్నో పేర్లు. అయితే ప్రసిద్దమైన పేర్లు 'లక్ష్మీ' మరియూ "శ్రీ", ఇవి వేదం చెప్పిన పేర్లు. అమె చేసే ఉపకారాలను బట్టి ఎన్నెన్నో పేర్లు చెప్పినా "హ్రీశ్చతే లక్ష్మీచ పత్-న్యౌ" లేక "శ్రీ భవతు " అంటూ వేదం చెబుతుంది. అందుకే భగవంతుణ్ణి గుర్తించేప్పుడు ఆయనలోని దయాది గుణాలను పైకి తెచ్చే నామంతో గుర్తించాలి. అందుకే ఆయనని శ్రీపతి లేక శ్రియపతి అని పిలుస్తుంటారు. లేదా లక్ష్మీనాథా అని పిలుస్తుంటారు. ఆయనకంటూ నారాయణ, విష్ణు అనే ఎన్నో నామాలు ఉన్నప్పటికీ ప్రచురంగా కనిపించే నామం శ్రీపతి అనో లేక లక్ష్మీనాథా అనో. ఆవిడ సంబంధం ద్వారా వచ్చిన నామాలు కనుక. అంటే ఆమె ఆయనలో పెంచిన దయ ద్వారా మనల్ని గుర్తిస్తాడు అని భావిస్తాం. మరి ఇలాంటి శ్రవణమాసపు మహాలక్ష్మి కి స్వాగతం పలుకుదాం. ఈ పాట ద్వారా ఎలా స్వాగతం పలకలో చూడండి మరి .
రంగుల ముగ్గులు ముంగిట నిలిచి రమ్మని పిలిచినవీ
వాకిట నిలిచినా తోరనమాలలు స్వాగతమోసగినవి
అనేకవిదాలుగా శ్రావణ లక్ష్మి దేవికి స్వాగతము పలుకుతున్నది. మరి ఇదే సంధర్బములో మన బ్లాగ్ మిత్రులందరి కోరికలు అమ్మ తప్పకుండా విని . వారికోరికలు నెరవేర్చాలని అమ్మని నేనుకూడా కోరుకుంటున్నాను. అందరికి శ్రావణమాసం శుభాకాంక్షలు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.