సంక్రాంతి అనగా సూర్యుడు రాశిలో ప్రవేశించడం. సూర్యుడు రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన కాలెండరులో ప్రతినెల ఒక సంక్రాంతి తో ప్రారంభమవుతుంది. దీనిని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒడిషా, పంజాబ్, గుజరాత్ మొదలగు రాష్ట్రాలలో పాటిస్తారు. మరొకవైపు బెంగాలీ కాలెండరు మరియు అస్సామీ కాలెండరులలో ప్రతి నెల చివరి రోజున సంక్రాంతిగా పరిగణిస్తారు. పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము. కనుకనే ఉత్తరాయనము వరకూ ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు. "సంక్రాంతి" లేదా "సంక్రమణం" అంటే చేరుట అని అర్ధం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంధంలో "సంక్రాంతి"ని ఇలా విర్వచించారు - తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః - మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చలనంలో (రధయాత్రలో) ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని "సంక్రాంతి పండుగ"గా వ్యవహరిస్తారు.
పెద్ద పండగ రెండవ రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు,జంతికలు,చక్కినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు.
సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు.అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు.కొత్త దాన్యము వచ్చిన సంతోషం తొ మనము వారికి దాన్యమ్ ఇస్తాము. హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. చిన్న పిల్లలు, సరదాగా గాలి పటాలు ఎగురవేస్తూ పండగను చాలా సంతోషంగా జరుపుకుంటారు. పతంగుల పోటీలు పెట్టుకుంటారు. ఇంకా పండగను ఎంతో బాగా జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండగ సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు.
>>>దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు,జంతికలు,చక్కినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి /...
రిప్లయితొలగించండిమరీ నోరూరించేస్తున్నా రండీ :)
శుభాకాంక్షల తో !
జిలేబి