మరల వశిష్ఠులవారు జనకునిని దగ్గర కూర్చోబెట్టుకుని కార్తీకమాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన విషయాలను ఉత్సాహంతో ఇలా చెప్పసాగిరి.
ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జన చేయుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగున్న పుణ్యకార్యాల వల్ల వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములు నశించుటేగాక, వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదులునో అని ఎదురుచూస్తుందురు. ఎవడు ధనవంతుడై ఉండీ పుణ్యకార్యములు చేయక, దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినా చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును.
కాబట్టి, ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలదీ దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయంసమయమున శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసి ఆ రాత్రంతయూ జాగారముండి మరునాడు తమ శక్తికొలదీ బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహపరములందు స్వరసుఖాలను అనుభవింతురు.
కార్తీకమాసములో విసర్జింపలసినవి
ఈ కార్తీక మాసంలో పరాన్నభక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి తినరాదు, శ్రాద్ధా భోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు, తిలాదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారములనాడు, సూర్యచంద్రగ్రహణపు రోజులలో భోజనం చేయరాదు. కార్తీక మాసములో నెల రోజులూ రాత్రులు భోజనం తినరాదు. విధవ వండినది తినకూడదు. ఏకాదశీ, ద్వాదశీ వ్రతములు చేయువారు ఆ రెండు రాత్రులూ తప్పనిసరిగా జాగారము ఉండవలెను.
కార్తీక మాసంలో ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలెను. ఈ మాసంలో నూనె రాసుకుని తల స్నానము చేయరాదు, పురాణాలు విమర్శించరాదు. కార్తీక మాసములో వేడినీటితో స్నానము చేసిన కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కాబట్టి వేడినీటితో స్నానం చేయరాదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడువకుండా కార్తీక మాసవ్రతమును చేయవలెనన్న కుతూహలము కలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అలా చేయువారు గంగా, గోదావరి, సరస్వతీ, యమున నదుల పేర్లను మనసులో తలచుకుని స్నానము చేయవలెను.
ఏది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాత: కాలమున స్నానము చేయవలెను. అలా చేయనిచో మహాపాపియై జన్మజన్మములు నరకకూపమున పడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతిదగ్గర కానీ, చెరువు దగ్గర కానీ, లేక ఇంటిలోని పంపువద్ద కానీ చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.
శ్లో : గంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదా సింధుకావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు!!అని చదువుకుంటూ స్నానం చేయాలి. కార్తీక మాసవ్రతం చేసేవారు పగలు పురాణ పటనం, హరికథాకాలక్షేపాలతో కాలం గడపాలి. సాయంత్రం పూట సంధ్యావందనాలు పూర్తి చేసి పూజామందిరంలో దీపాలు వెలిగించి, శివకేశవుల్ని అష్టోత్తరాలతో పూజ జేయాలి. ఈ ప్రకారం శివపూజ చేసివారు ధన్యజీవులు. పూజ తర్వాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో సత్కారము చేసి సంతోషపర్చవలెను. ఇలా చేసినవారు నూరు అశ్వమేథ యాగములు చేసిన పుణ్యం, వెయ్యి వాజిపేయ యాగములు చేసిన ఫలం పొందుతారు.
ఈ కార్తీక మాసము నెలరోజులూ బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని, నిత్యదీపారాధన, తులసికోటవద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసినవారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగుతుంది. చేయగల శక్తి ఉండి కూడా ఈ వ్రతాన్ని చేయలేనివారు నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక వంటి వివిధ జన్మలెత్తుతారు. ఈ వ్రతము శాస్త్రం ప్రకారం ఆచరిస్తే పదిహేను జన్మల పూర్వజ్ఞానము కలుగుతుంది. వ్రతం చేసినా, పురాణం చదివినా, విన్నాకూడా సకలైశ్వర్యములు కలిగి మోక్షాన్ని పొందుతారు.
మీరు రాసిన బ్లాగ్స్ చాల బగునని గత మూడు రోజులు గా చదువు తున్న ను ఇలాగే కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను .........!
రిప్లయితొలగించండి