రాగము: కొండమలహరి
ఏమో సేయఁగఁ బోగా నేమో ఆయ
యేమని చెప్పుదుఁ బను లిటువంటివే ॥పల్లవి॥
వుక్కుమీరి కృష్ణుఁడు మావుట్లు దించఁబోఁగాఁ
బక్కన నేఁ బారి తెంచి పట్టుకొంటినే
మొక్కలాన నతఁడు నా మోము చూచె నంతలోనె
మక్కువ నా మే నెల్ల మర పాయనే
॥ఏవె॥
కమ్మర నంతటఁబోక కాఁగులపాలంటఁ బోఁగా
బిమ్మిటిగాఁ గిందుమీఁదై పెనఁగితినే
యెమ్మెల నాతఁడు నా యిక్కువకుఁ జేయి చాఁచె
కమ్మి నా చిత్తము నీరై కరఁగితినే
॥ఏవె॥
వుద్దండాన గట్టి వెన్నముద్ద లారగించఁగానె
గద్దించి కాఁగిట నేఁ గమ్ముకొంటినే
వొద్దనె శ్రీ వెంకటేశుఁ డొంటి నన్నుఁ గూడఁగా
నిద్దరికిఁ బులకించి యేక మైతిమే
॥ఏవె॥
కవి భావము:
ఆయన చేసిన పనులు ఏమని చెప్పను ఇలాంటివి అని చెప్పలేకున్నాను. అతిశయముతో కృష్ణుడు మా ఉట్లు దించబోగా పక్కన నేను బరితెగించి పట్టుకొన్నాను. ధైర్యంగా అతడు నా ముఖము చూసి అంతలోనే ఇష్టముతో నాశరీరమంతా తన్మయం చెందినది. అతను కమ్ముకొనగా అంతలోనే కాగిన పాలు అంటుకోగా సంకోచముతో కిందమీద అయి కౌగిలించుకొనగా. విలాసముతో అతడు నాపై ఇష్టముతో చేయిచాచి చుట్టుకొనగా నా మనస్సుతో నీరై కరిగిపోయానే. ఎక్కువైన గట్టి వెన్నముద్దలా ఆరగించగానే బెదిరించి కౌగిలించుకొని నేను కమ్ముకొంటిని. సమీపములో శ్రీవేంకటేశుడు కన్నులు కలువగా ఇద్దరికీ పులకించి ఒకటైతిమి అంటు అన్నమయ్య కీర్తించాడు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.