Blogger Widgets

గురువారం, అక్టోబర్ 31, 2013

ఉక్కుమనిషి పటేల్

గురువారం, అక్టోబర్ 31, 2013

ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నేడే 
ఉక్కుమనిషిగా మనకు బాగా తెలిసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875, అక్టోబరు 31న గుజరాత్ రాష్ట్రంలోని నదియాద్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి జవేరిభాయ్ పటేల్ వ్యసాయం చేసేవాడు. తల్లి లాద్ బాయ్. వారికి ఆరుగురు సంతానంలో పటేల్ నాల్గవవాడు. వారిది చాలా పేదకుటుంబం అవ్వటం వలన  పిల్లల్ని చదివించటం చాలా కష్టంగా వుండేది.  వల్లభాయ్ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో స్కూల్ చదువు వరకు చదవగలిగాడు. పటేల్ స్కూలులో చదువుతున్నప్పుడు పుస్తకాలు కొనుక్కొనే పరిస్థితి  లేకపోవటం వలన తన  స్నేహితుల దగ్గర పుస్తకాలు తీసుకొని వాటిని పూర్తిగా బట్టి పట్టేవాడు.  ఒక రోజు తన ఉపాధ్యాయుడు నీ పుస్తకం ఏది?" అని అడిగినప్పుడు, ఎంతో ధైర్యంతో "నాకు పుస్తకాలు కొనుక్కొనే స్తోమత లేదు కాబట్టి నోట్సు మాత్రమే రాస్తున్నాను. కానీ టెక్స్ట్ పుస్తకాల్లో ఇంత వరకు జరిగిన పాఠాలు అన్ని నాకు అక్షరం తప్పకుండా గుర్తున్నాయి అని చెప్పాడు. ఆ సమాధానం విన్న ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయి "ఏదీ ఆహార నియమాలు పాఠం చెప్పు చూద్దాం" అని అడిగాడు. అంతే పటేల్ అక్షరం పొల్లు పోకుండా పాఠాన్ని గడగడా అప్పజేప్పేసాడు . అది విని ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయాడు. మెట్రిక్యులేషన్ తరువాత, కాలేజీ చదువులకు స్తోమతలేకపోవటం వల్ల ప్లీడరు పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యి, గోధ్రా అనే చిన్న పట్టణంలో ప్రాక్టీసు ప్రారంబించాడు. ప్రారంభించిన కొద్దిరోజులకే పటేల్ ప్రతిభను అందరూ గుర్తించసాగారు. అతను పట్టిన కేసులు ఓడిపోవటం అంటూ ఎప్పుడూ జరగలేదు. చివరకు ఆంగ్లేయులైన జడ్జీలు కూడా అతని వాదనను విని ముచ్చట పడేవారు.  ఇంగ్లాండులో బారిష్టరు పరీక్ష చదివేనిమిత్తం తనకు ప్రయాణంలో సహాయం చేయమని అర్ధిస్తూ వల్లభాయ్ పటేల్ ఒక ట్రావెల్ ఏజన్సీకి లేఖ రాశాడు. అది చదివిన ఏజన్సీవారు వెంటనే సహాయం చేయటానికి అంగీకరించి లేఖరాశారు. 1913లో బారిష్టరు పరీక్షలో ఉత్తీర్ణుడై భారతదేశం తిరిగి వచ్చి తన ప్రాక్టీసును మరింత వృద్ది చేసుకున్నాడు. ఆ సమయంలో బొంబాయి చీఫ్ జస్టిస్, సర్ బాసిన్ స్కాట్ పటేల్ ని ప్రభుత్వ సర్వీసులో చేరమని ఆహ్వానించాడు. అయితే దేశాభిమానం మెండుగాగల పటేల్ ఆ ఉద్యోగాన్ని తిరస్కరించి క్రిమినల్ లాయరుగా పేరు ప్రఖ్యాతలు పొందసాగాడు. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోధ్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగామహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. 1917లో మొదటిసారిగా పటేల్ కు గాంధీలోని నిర్మలత్వం, నిరాడంబరత్వం, స్వార్ధరహిత ప్రేమ, దేశాభిమానం పటేల్ ను విశేషంగా ఆకర్షించాయి. భారతదేశంలో వ్యాపారం చేయటానికి వచ్చి, విభజించిపాలిస్తున్న ఆంగ్లేయులను తరిమి కొట్టాలనే ధృఢ నిశ్చయం ఆక్షణంలోనే తీసుకున్నాడు. ప్రజలలోకి చొచ్చుకొనిపోయి, వారి అవసరాలను తీర్చి, సహాయ సహకారాలు అందజేసి, వారిసహాయంతోనే విదేశీయుల్ని వెళ్ళగొట్టవచ్చుననే అభిప్రాయం కలిగి అహమ్మదాబాదు మున్సిపల్ ఎన్నికలలో పోటీచేసి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అనంతరం అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. పటేల్ అధ్యక్షుడిగా నిర్వహణా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన చేసిన సేవల వర్ణనాతీతం. నగరంలో ప్లేగు వ్యాధి విపరీతంగా వ్యాపించటం జరిగింది అప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలూ వ్యాపారసంస్థలూ అన్నీ మూసేసి ప్రజలు భయబ్రాంతులై ఉన్న సమయంలో పటేల్ ఆరోగ్య అధికారులతో నగరంలోని ప్రతి మారుమూల ప్రాంతంలోనూ తిరిగి ఒక్కరినీ వదలకుండా అందరికీ వైద్యం అందించాడు. రోగుల దగ్గర నిర్విరామంగా గడపటం వలన ఆయనకు కూడా దురదృష్టవశాత్తు ఆ వ్యాధి సోకింది. కొద్ది రోజుల్లోనే ఆయనకు వ్యాధి తగ్గింది.ప్లేగు వ్యాప్తి చెందినప్పుడే కాకుండా, వరదల్లోనూ, కరువుకాటకాల్లోనూ ప్రజలకు అండగానిలిచి వారి అభిమానం చూరగొన్నాడు.  ఇతను ప్రముఖ స్వాతంత్ర యోధుడు మాత్రమే కాడు, స్వాతంత్రానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సపలుడైన ప్రముఖుడు. 
గాంధీజీతో పాటు అనేక సత్యాగ్రహాలు చేసి సహాయ నిరాకరణోధ్యమాలు నిర్వహించి కారాగారాలు అనుభవించి బ్రిటీషు వారి గుండెల్లో గుబులు కలిగించాడు పటేల్. సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఉధ్యమంలోనూ పాల్గొన్నాడు.  1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించాడు. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు. స్వాతంత్రానంతరం జవహార్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో హోంమంత్రి గాను, ఉప ప్రధానమంత్రి గాను బాధ్యతలను నిర్వహించాడు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేధించాడు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనాడు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్దతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించాడు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదాన్ని ఇచ్చి గౌరవించింది.

1 కామెంట్‌:

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)